హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై సంయుక్తంగా ఒత్తిడి తేవాలని కోరుతూ శనివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులకు ఆయన లేఖలు రాశారు. ఈ విషయమై త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆయిల్ పామ్ పంటకు కనీస హామీ ధర కల్పించాలని కోరనున్నట్లు తెలిపారు.
దేశంలో ఇప్పటికే 2.73 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుచేశారని, అందులో 2.05 లక్షల హెక్టార్లు (75 శాతం) ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లోనే సాగవుతోందని పేర్కొన్నారు. క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తిరిగి 44 శాతానికి పెంచాలని లేదా ఆయిల్ పామ్ గెలల ధరను టన్నుకు రూ.25 వేలుగా నిర్ణయించి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
